Oct 09,2023 00:10

వర్షం పడితే ఖాజీపేట కూడలి పరిస్థితి(ఫైల్‌ఫోటో)

ప్రజాశక్తి-తెనాలి : రోడ్ల దుస్థితిపై రోడ్లు భవనాల శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. వాహనచోదకులు నిత్యం ప్రమాదాలకు గురతున్నా వారిలో ఏమాత్రమూ చలనం లేదు. దీనికి తోడు ప్రజాప్రతినిధులు కూడా చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. గట్టిగా నిలదీసిన వారు కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. దీనికి తోడు ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించటంలేదని టెండర్లు ఖరారైనా కాంట్రాక్టర్లు అగ్రిమెంట్‌కు ముందుకు రావటం లేదు.
తెనాలి ఆర్‌అండ్‌బి డివిజన్‌లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ఆధ్వానంగా మారాయి. తెనాలి నుంచి దుగ్గిరాల వెళ్లే రోడ్డులో సోమసుందరపాలెం, ఆటో నగర్‌ వద్ద సైకిళ్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై పెద్ద గోతులు పడ్డాయి. వర్షం పడితే నీరు నిలబడి గోతులు కనబడే పరిస్థితి కూడా లేదు. పేరుకు నాలుగు లైన్ల రోడ్డుగా ప్రజాప్రతినిధులు గొప్పలు చెబుతున్నా, ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నందివెలుగు గుంటూరు మార్గం మరీ దయనీయంగా ఉంది. నందివెలుగు వంతెన మొదలు జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ వరకూ వాహన చోడకులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదంలో పడినట్లే. ఎరుకలపూడి అడ్డరోడ్డు- కొలకలూరు ఫ్లైఓవర్‌ మధ్య పెద్ద పెద్ద గోతులు. ఈ గోతుల్లో కార్లు దిగితే షాకర్లు ఎగిరిపోవాల్సిందే. కొమ్మమూరు కాల్వ వంతెనపై, దాని దిగువ భాగం, జూబ్లీ హైస్కూల్‌ వద్ద , సినిమా హాలు సెంటర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా రోడ్డు సరిలేదు. ముఖ్యంగా కోనేటిపురం కూడలికి సమీపంలో కల్వర్టు కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న తూము పగిలిపోయి, గోతులు ఏర్పాడ్డాయి. అధికారులు పట్టించుకోకపోవటంతో స్థానికులే ఆ గోతులో బండరాళ్లు కుక్కి, ప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతంలో చెట్టు కొమ్మలను ఉంచారు. రాత్రి వేళల్లో ఎవరైనా కొత్తవారు ఈ మార్గంలో ప్రయాణిస్తే వాహనాలు ప్రమాదాల భారిన పడాల్సిందే.
గతంలో ఇదే ప్రాంతంలో పిడపర్తిపాలేనికి చెందిన పెయింటర్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయారు. తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు కూడా. కొమ్మమూరు కాల్వ వంతెనపై ఉన్న గోతిలో నందివెలుగులో హోటల్‌ కార్మికుడి బైక్‌ అదుపుతప్పి గాయాలపాలై మృతి చెందాడు. బాపయ్యపేట, ఖాజీపేట కూడళ్ళలో, ఖాజీపేట నుంచి హాఫ్‌పేట, జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ వరకు రోడ్డు గుంతల మయమే. నిత్యం రాత్రి వేళల్లో ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆర్‌అండ్‌బి అధికారులు మాత్రం కనీసం మరమ్మతులపైనా దృష్టి సారించటంలేదు.
ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు లేకపోవటంతో, వారు కొత్తగా పనులు చేపట్టేందుకు ముందుకు రావటంలేదని అధికారులే చెబుతున్నారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, అవసరమైన చోట రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై, టెండర్లు కూడా ఖరారైనా అగ్రిమెంట్‌కు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే అర్ధమవుతోంది. దీంతో రోడ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రమాదక రమైన పరిస్థితులపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరికొంత మంది ప్రాణాలు పోకముందే కనీస మరమ్మతులైనా చేపట్టాలని ప్రజలు, ప్రయాణీకులు కోరుతున్నారు.
ఈ దారిలోనే ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నా..
ఈ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే స్వయంగా గమనిస్తూ కూడా రోడ్ల నిర్మాణానికి చొరవ చూపటంలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ దాదాపు 20 రోజులుగా కొలకలూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తూనే ఉన్నారు. ఆయన ప్రయాణించే వాహనాలు కూడా ఈ మార్గంలో రావాల్సిందే. నందివెలుగు- తెనాలి మధ్య నాలుగు లైన్ల రోడ్డులో కుడివైపు రోడ్డు నున్నగా ఉండటంతో రాంగ్‌ రూటైనా ఆయన వాహనాలకు రయ్యన పరుగెడుతున్నాయి. నందివెలుగు- జాకీర్‌హుస్సేన్‌ నగర్‌ మధ్య ఎరుకలపూడి, కొలకలూరు, ఖాజీపేట, హాఫ్‌పేట రోడ్లు ఎంత ప్రమాద భరితంగా ఉన్నా పట్టీపట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు నిట్టూరుస్తున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం రోజునే అభివృద్ధిపై ప్రజాప్రతి నిధులను నిలదీసిన ఓ యువకుడిని కేసులో ఇరికించి, వేధింపులకు గురిచేసినట్లు స్థానికులంటున్నారు.
స్పందించిన పోలీసులు
రోడ్డు ప్రమాదాల తీవ్రతను గుర్తించిన రూరల్‌ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ సిహెచ్‌ వెంకటేశ్వర్లు స్పందించారు. ఆయా గ్రామాల ప్రజల సహకారంతో ఇటీవల టిప్పర్‌లో డస్ట్‌ తోలించి గోతుల్లో పోయించారు. అయితే వర్షాలకు అది కూడా లేచిపోయింది. తిరిగి యథాస్థితికి చేరింది. ప్రమాదకరంగా ఉన్న రోడ్డు ప్రయాణికులను వణుకుపుట్టిస్తోంది.
కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు
నాగేశ్వరరావు, డిఇఇ, ఆర్‌అండ్‌బి, తెనాలి.

నందివెలుగు గుంటూరు ఆర్‌అండ్‌బి రోడ్డుకు రూ.3.30 కోట్లు, నందివెలుగు- దుగ్గిరాల రోడ్డుకు రూ. 3.70 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు ఖరారైనా అగ్రిమెంట్‌కు మందుకు రావటం లేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం లేదని కాంట్రాక్టర్లు మొండికేస్తున్నారు. నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌ నుంచి సమాదానమే లేదు. ఈ పరిస్థితుల్లో మేమైనా ఏం చేయగలం?