
ఇబ్బందులు పడిన ప్రజలు
పలాస : పాత బస్టాండ్‌కు వెళ్లే కె.టి రోడ్డు పైనే సామాజిక సాధికార యాత్ర సభా వేదికను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. శనివారం రాత్రి నుంచే సభా వేదిక పనుల దృష్ట్యా శ్రీనివాస లాడ్జి నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌కు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకూ అవకాశం లేకపోవడంతో పలాస నుంచి కాశీబుగ్గ వెళ్లేందుకు వీధుల మీదుగా తిరుగుతూ మూడు రోడ్ల జంక్షన్‌కు వెళ్లేందుకు తిప్పలు పడ్డారు. పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌కు బస్సులు రాకపోవడంతో శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయాణికులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఇచ్ఛాపురం నుంచి విశాఖ, శ్రీకాకుళం వెళ్లే బస్సులు, విశాఖ నుంచి ఇచ్ఛాపురం వెళ్లే బస్సులు కనీసం పాతబస్టాండ్ రావడానికి అవకాశం లేకుండా పాత జాతీయ రహదారి మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఆపివేశారు. ఆటోలు కూడా తిరగకపోవడంతో నడుచుకుని కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలికి చేరుకుని అక్కడ బస్సులు ఎక్కారు. రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించడమేమిటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.