ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో కొడవటిపూడి గ్రామానికి సంబంధించి ప్రధాన రహదారి అపారిశుధ్యానికి అడ్డాగా దర్శనమిస్తోంది. కొడవటిపూడి ప్రధాన కూడలి రహదారిలో గడిచిన దశాబ్ద కాలంగా రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు సమీపంలో ఇళ్ల నుండి వాడుకనీరు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా రోడ్డు దుస్థితి ఇలాగే ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అద్వాన స్థితికి చేరుకోవడంతో పాటు మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రాత్రి సమయంలో పాదచారులు, వాహనదారులు కూడా తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల వాసులు ఈ రోడ్డుపై నుండి వాణిజ్య కేంద్రమైన తుని వెళ్లేందుకు దగ్గరగా ఉండడంతో రహదారి రద్దీగా ఉంటుంది. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు సహా అధికారులు, నాయకులు గ్రామాన్ని దర్శించి వెళ్ళారే గాని ఎటువంటి హామీలు, నిధులు మంజూరు చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










