Nov 22,2023 00:09

పల్నాడు కలెక్టరేట్‌ ఎదుట రహదారిపై భోజనం తయారు చేసుకుంటున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో కార్మికులు గుంటూరు, పల్నాడు కలెక్టరేట్ల ఎదుట మంగళవారం వంటావార్పు చేపట్టారు. గుంటూరులో ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో నిరసన తెలపగా నరసరావుపేటలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనతోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు నిరసనలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ కార్మికులు చేసిన పోరాటాల సందర్భంగా వైసిపి నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారని, తమ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పించారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటక్కెక్కించారని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులందరినీ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చి 'ఎంప్లాయీ' అని నమోదు చేయడంతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయన్నారు. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన జీత భత్యాలు, ఇతర సౌక్యాలు ఏవీ వీరికి దక్కట్లేదన్నారు. 99.5 శాతం హామీలు అమలు చేశామంటున్న ప్రభుత్వానికి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అని ప్రశ్నించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనకు అవసరమైన అన్ని కోర్టు తీర్పులనూ అమలు చేస్తుందని, కానీ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పును మాత్రం అమలు చేయట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ కపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకూ వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.రమేష్‌బాబు, నాయకులు పి.శ్రీనివాసరావు, కె.శివయ్య, కె.వెంగమ్మ, భూషమ్మ, మంగమ్మ, పి.పూర్ణచంద్రరావు, జి.ప్రసాదరావు పాల్గొన్నారు.
నరసరావుపేట నిరసనలో స్థానిక ధర్నా చౌక్‌ వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. అక్కడే భోజనాలు చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ఎత్తున మున్సిపల్‌ కార్మికులు ర్యాలీగా వెళ్లారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా పనిచేస్తునా కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, నామమాత్రపు వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని అన్నారు. పే స్కేల్‌ ప్రకారం వేతనాలు, కరువు బత్యం ,ఇంటి అద్దె, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ మున్సిపల్‌ కార్మికులకు లేవని అన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రకళ, ఎ.సాల్మన్‌రాజు మాట్లాడుతూ జీవో 114 ద్వారా రాష్ట్రంలోని 10115 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా వారిలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఒక్కరైనా లేరని, అయితే తాము మాత్రం 40 వేల మందికి పైగా పని చేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌తో సమానమని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట ఏమైందని నిలదీశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా మరోసారి శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె చేస్తామన్నారు. ఆందోళనకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌రెడ్డి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రవిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. నాయకులు వెంకయ్య, మల్లయ్య, పి.ఏసు, వీరకుమార్‌, జీవరత్నం, విజయలక్ష్మి, నరసింహారావు, సీతారామయ్య, మార్తమ్మ, సుజాత, సామ్యేలు, లాజర్‌, పి.శ్రీను, గోపి పాల్గొన్నారు.