
గంజాయి ప్యాకెట్లు
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మున్సిపాలిటీ లోని బలిఘట్టం మెయిన్ రోడ్‌పై గంజాయి ప్యాకెట్లు కలకలం రేపాయి. గంజాయి స్మగ్లర్ బైక్ పై సంచిలో ప్యాకింగ్ చేసిన గంజాయిని తీసుకొని తుని వెళ్తుండగా అదే సమయంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ వస్తుంది. బైక్ వ్యానును తాకడంతో గంజాయి సంచి రోడ్డుపై పడిపోయి అందులో ఉన్న ప్యాకెట్లు రోడ్ పై చెల్లాచెదరయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో భయంతో వెంటనే గంజాయి స్మగ్లర్ పరారయ్యాడని తెలిపారు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి నాతవరం వెళ్తున్న ఎస్సై రామారావు జనం గుమికూడి ఉండటాన్ని చూసి పోలీస్ వాహనం ఆపారు. వెంటనే సమాచారాన్ని నర్సీపట్నం టౌన్ పోలీసులకు తెలియజేశారు. టౌన్ ఎస్‌ఐ సుధాకర్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.