ప్రజాశక్తి - మండవల్లి
పంచాయతీ అధికారుల విధి నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారి తీరుతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిపై ఉన్న చెత్తను సంపద కేంద్రానికి తరలించకుండా రహదారిపైనే తగలబెట్టేస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో కాలుష్యం వెదజల్లడంతో పాటు దట్టమైన పొగ ఏర్పడడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారితో పాటు గ్రామంలోని పలు ప్రాంతాలు చెత్తకుప్పలకు నిలయం అయిపోయాయి. దీంతో ఆ చెత్తకుప్పల నుంచి దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల వ్యాప్తికి నిలయాలుగా మారాయి. దీనిపై చెత్త రహదారులు శీర్షికన ప్రజాశక్తిలో కథనం ప్రచురితమైంది. దీంతో ఎవరు ఏమి ఆదేశించారో ఏమో కాని చెత్తను సంపద కేంద్రానికి తరలించకుండా పంచాయతీ కార్మికులు దగ్గరుండి చెత్తకుప్పలకు నిప్పంటించి తగలబెట్టేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో జాతీయ రహదారిపై దుర్వాసన వెదజలే దట్టమైన పొగ అలముకుంది. దీంతో రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. గ్రామానికి ఆదాయం సమకూర్చే విధంగా సంపద తయారు చేసే విధంగా కేంద్రానికి చేరుకోవాల్సిన చెత్త అధికారుల నిర్లక్ష్యంతో కాలి బూడిదైందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకుని మండవల్లి మండల కేంద్రాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. రహదారిపై చెత్తను తగలబెడుతున్న విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఏ అధికారీ అందుబాటులోకి రాలేదు.










