Jul 08,2023 19:28

రోడ్డుకు బండలు పాతిన ఘనుడు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణానికి చెందిన ఓ ఘనుడు ఏకంగా రోడ్డును ఆక్రమించారు. ఆ రోడ్డు పక్కన తనకు స్థలం ఉండడంతో రోడ్డు స్థలం కూడా తమదంటూ నాపరాతి బండలు పాతారు. దీనివల్ల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్‌ కమిషనర్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆక్రమణలపై చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంతో రోడ్లు కూడా ఆక్రమణకు గురైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. గీతా నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌కు ఎదురుగా సర్వే నెంబర్‌ 317 పైకిలో లేఅవుట్‌ ప్లాన్‌ నెంబర్‌ 222/78, ఎమ్మిగనూరు మున్సిపల్‌ కార్యాలయం ఫైల్‌ నెంబర్‌ 15827/78/డి5లో కనబరిచిన 40 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డును గీతా నగర్‌లో నివాసం ఉంటున్న గొల్ల ఉలి రామాంజనేయులు, బంధువులు ఆక్రమించి దౌర్జన్యంగా నాప బండలు పాతారు. ఈ రోడ్డు పక్కన ఉన్న శ్రీచైతన్య స్కూల్‌ స్థలం యాజమాన్యం హిరణ్మయి మాస్టర్‌ ప్లాన్‌ 40 అడుగుల రోడ్డు అభివృద్ధి కోసం సర్వే నెంబర్‌ 419 పైకిలో విస్తీర్ణం 175.46 (0.02 సెంట్లు) చదరపుగజాల స్థలాన్ని ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి ఇచ్చారు. ఎప్రిల్‌ 21, 2011న ఎమ్మిగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ వారి పేరిట ఎమ్మిగనూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించారు. డాక్యుమెంట్‌ నెంబర్‌ 2107/2011 ద్వారా హక్కు కల్పించారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు యుటి.ఎల్లయ్య కాంప్లెక్స్‌ (శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌) నుంచి ప్రభుత్వాస్పత్రి మార్చురి వెనుక భాగంలో గల మెయిన్‌ రోడ్డు వరకు 40 అడుగుల వెడల్పు కలిగి ఉంది. గొల్ల ఉలి రామాంజనేయులు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు పక్కన వారి స్థలం ఉండడంతో ఇక్కడ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు లేదని, ఈస్థలం తమదంటూ ఆక్రమించారు. రోడ్డుకు అడ్డంగా, స్కూల్‌ విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా నాపబండలు పాతారు. ఈ ఆక్రమణపై మున్సిపల్‌ కమిషనర్‌కు స్పందనలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ వ్యవహారం వివాదస్పదంగా మారినా, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు అడ్డంగా పాతిన బండలను తొలగించకుండా మున్సిపల్‌ కమిషనర్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులకు కమిషనర్‌ కొమ్ము కాస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పై తెలిపిన సర్వే నెంబర్‌లో గల 40 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు రికార్డులను పరిశీలించి ఆక్రమణదారులపై, బండలను తొలగించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని రోడ్డుకు అడ్డంగా పాతిన బండలను తొలగించి, ప్రజా ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నారు. ఇరు వర్గాల పత్రాలను డీఎస్పీ పరిశీలించి, విచారణ చేపడుతున్నారు.
ఆక్రమణదారునిపై చర్యలు తీసుకోవాలి
- ఆరవీటి సుధాకర్‌ శెట్టి

మున్సిపల్‌ అప్రూవల్‌ పొందిన రోడ్డును ఆక్రమించిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.