Jul 29,2023 23:01

              ప్రకృతి ప్రకోపం.. పాలకుల విధానాల శాపం ఫలితంగా వివిధ తరగతుల ప్రజలు రోడ్డున పడుతున్నా.. రోడ్డెక్కుతున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోగా జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గోదావరి వరదలు నదీ పరివాహక ప్రాంతాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ పునరావాస కేంద్రాలకు తరలేలా చేస్తుంటే.. భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. తమ విధులు.. నిధుల సంగతేంటంటూ సర్పంచులు ఆందోళనబాట పట్టినా అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోదావరి మళ్లీమళ్లీ కన్నెర్రజేస్తోంది. గతంలో మాదిరిగానే విలీన మండలాల ప్రజలతోపాటు ధవళేశ్వరం దిగువన ఉన్న లంక గ్రామాల ప్రజలను వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ.. తగ్గుతూ.. మళ్లీ అనూహ్యంగా పెరుగుతూ గోదారమ్మ అందరినీ బెంబేలెత్తిస్తోంది. గత సంవత్సరం మాదిరిగానే ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఊళ్లొదిలి పునరావాస కేంద్రాలకు రావాలని చెప్పడం మినహా పెద్దగా సహాయక చర్యలు చేపట్టిన దాఖలాల్లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనమే పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్తే బాధితులు అడ్డుకోవడం. ఇప్పటికీ ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాల కల్పన అనేది పూర్తిగా నిలిపివేసింది. రోడ్లు అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి మారగా గ్రామాల్లోనూ లెక్కలేనన్ని సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం చెబుతున్నట్లు ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అనవసరం అనుకుంటే అక్కడున్న ప్రజలకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన పరిహారం, ప్యాకేజీ, పునరావాసం త్వరితగతిన పూర్తి చేసి వారిని అక్కడి నుంచి తరలిస్తే వరదల గురించి ఆందోళనే ఉండదు. ప్రభుత్వం, అధికారుల హడావుడీ కూడా అవసరం ఉండదు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోగా కనీసం వరదలు చుట్టుముడుతున్నా తూతూమంత్రంగా పునరావాస కేంద్రాలకు తరలించి చేతులు దులుపుకోవడంపై అంతా పెదవి విరుస్తున్నారు. ఇదేనా సిఎం జగన్‌ చెబుతున్న మానవతాదృక్ఫథం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సిఎం, ప్రభుత్వం పదేపదే తమపై దయతో.. జాలితో వరదల నుంచి ఆదుకుంటున్నట్లు చెప్పనవసరం లేదని, బటన్‌ నొక్కి పునరావాస పరిహారం, ప్యాకేజీ అందిస్తే తామే గ్రామాలు ఖాళీ చేస్తామని నిర్వాసితులు ఘంటాపథంగా చెబుతున్నారు. అప్పటి వరకైనా తమను నిలువునా ముంచేయకుండా పునరావాస కేంద్రాలకు తరలించేసి సరిపెట్టకుండా బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు వంటివన్నీ సమకూర్చాలని, ప్రధానంగా తాగునీరు అందించాలని వరద బాధితులు వేడుకుంటున్నారు. లేనిపక్షంలో ఎంఎల్‌ఎ బాలరాజుకు ఎదురైన అనుభవమే ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
ఇక వర్షాలు ఉమ్మడి జిల్లావాసులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా దిగ్బంధించాయి. ఎడతెరిపి లేని వర్షాలతో గ్రామాలు.. పట్టణాల్లో పారిశుధ్యం క్షీణించింది. ప్రధానంగా అవుట్‌లెట్లు లేకపోవడం, మురుగుపారుదల వ్యవస్థను పట్టించుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ నీట మునిగి రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. ఆ నీటిలో ప్రయాణం చేస్తే గుంతల లోతు తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికితోడు ఈ సంవత్సరమూ కనీసం రోడ్ల మరమ్మతులు చేపట్టకపోగా వర్షాకాలం ముందు మార్జిన్లలో చేపట్టే జంగిల్‌ క్లియరెన్స్‌ చేయకపోవడంతో రోడ్లపైనే వర్షపునీరు నిలిచిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో మార్జిన్లు ఎత్తుగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లోనైతే మార్జిన్లు కానరాని విధంగా మొక్కలు, పొదలు పెరిగినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఫలితంగా రోడ్లు మరింత దెబ్బతినడంతో వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తలకు దెబ్బ తగలకుండా హెల్మెట్‌ సరే.. కాళ్లు, చేతులకు రక్షణ ఏమిటని పోలీసు సిబ్బందిని ద్విచక్ర వాహనదారులు ప్రశ్నిస్తున్నారంటే జనం ఎంత విసిగిపోయారో అర్థమవుతోంది. దీనికితోడు భారీ వర్షాలతో రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. జనం బతుకులను రోడ్డున పడేసిన ఈ పాలకులు ఇప్పటికైనా రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో ప్రజలే ఈ పాలకులను రోడ్డున పడేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.
ఇక పంచాయతీ సర్పంచులు అంతా రోడ్డెక్కారు. తమ విధులు, నిధులు హరించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టిన సర్పంచులు మండల పరిషత్‌ తదితర సమావేశాలను వేదిక చేసుకుని తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. కనీసం చిన్నపాటి పని కూడా చేసే పరిస్థితి లేకుండా నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటోందని, కనీసం తమ విధులు సైతం సరిగ్గా నిర్వర్తించనీయకుండా అధికార పార్టీ నేతలు హల్‌చల్‌ చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులైన సర్పంచులతోపాటు అధికార పార్టీ మద్దతుదారులైన సర్పంచులు సైతం గళమెత్తుతుండటం గ్రామాల్లో అధికార పార్టీ అరాచకాలకు, నియంతృత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల బలోపేతం పేరిట గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా సచివాలయాలు ఏర్పాటు చేశామని చెబుతున్న వైసిపి ప్రభుత్వం మరి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల విధులు, నిధుల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మారకపోతే గ్రామాలు మరిన్ని సమస్యల సుడిలో కూరుకుపోయి ప్రజలే ప్రభుత్వంపై కన్నెర్రజేసే పరిస్థితులు పొంచి ఉన్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు జనాన్ని రోడ్డున పడేసే విధానాలు వీడకపోతే కచ్ఛితంగా ఈ పాలకులను ప్రజలే రోడ్డున పడేస్తారనేది రాజకీయ పరిశీలకుల అంచనా.
                                                                                                                                                                         -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌