ప్రజాశక్తి-పంగులూరు: మండల కేంద్రమైన పంగులూరు నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లే రోడ్డు, అడుగడుగునా గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఆటకాన్ని కలిగిస్తుంది. పంగులూరు నుంచి చందలూరు, నూజిల్లపల్లి, పమిడిపాడు, పోతవరం, నాగులుప్పలపాడు, మీదుగా వెళ్లే ఈ రోడ్డు దుర్భరంగా మారి పోయింది. ఒకప్పుడు జిల్లా పరిషత్తు రోడ్డుగా ఉన్న ఈ రహదారిని, సుమారు పది సంవత్స రాల క్రితం ఆర్‌అండ్‌బి కిందకు మార్చి తారు రోడ్డు వేశారు. ఇప్పటికే మూడుసార్లు తారు వేశారు. అయితే ఈ రోడ్డు అనతికాలంలోనే పూర్తిగా చెడిపోయింది. రోడ్డంతా గుంతలమ యంగా మారిపోయి, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్డులో ఒంగోలు నుంచి పంగులూరుకు ఆర్టీసీ బస్సులు సుమారు 8 ట్రిప్పులు తిరుగుతాయి. నూజిల్లపల్లి నుంచి చందలూరు హైస్కూల్‌కు విద్యార్థులు బస్సుల్లోనూ, ఆటోల్లోనూ, మోటార్ సైకిల్ పైన వస్తూ ఉంటారు. చందలూరు, నూజిల్లపల్లి గ్రామాల నుంచి వివిధ రకాల పనులపై ప్రజలు మండల కేంద్రమైన పంగులూరుకు వస్తుంటారు. అయితే రోడ్డు బాగా లేకపోవడం వలన ప్రయాణం నరకయాతనగా మారుతోందని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై గుంతలు పెద్దపెద్దవిగా మారిపోయాయి. అంతకుముందు వేసిన ప్యాచ్ వర్క్ కూడా అంతా లేచిపోయి గుంతలు ఎక్కువగా మారాయి. ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని ప్రయాణికులు తెలుపుతున్నారు. ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, టూ వీలర్ నడిపే వాళ్లు కూడా ఇక్కడ ప్రయాణం చేయలేమంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డు మొత్తం మళ్లీ తారు రోడ్డు వేయాల్సిందిగా ప్రజల కోరుతున్నారు.










