Jul 26,2023 19:08

రోడ్డు దగ్గర నిరసన చేపడుతున్న నాయకులు, రైతులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని బైచిగేరి నుంచి పెద్దకడబూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆ రోడ్డు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డుపై అడుగుకో గుంత పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అసలే వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలిచి ప్రయాణించేందుకు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. రద్దీ రహదారి కావడంతో ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయన్నారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు. అలాగే పెద్దతుంబలం గ్రామంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉందన్నారు. స్కూటర్లు, బండ్లు, ప్రజలు నడిచే పరిస్థితి లేదని తెలిపారు. అలాగే అడవిలో రోడ్డు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు సరిగా లేదన్నారు. దాదాపు వేయి మంది ఆయకట్టు రైతులు ఇదే దారి వెంట ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. గ్రామ నాయకులు హనుమంతు రెడ్డి, ముత్తన్న, వీరన్న, నరసప్ప పాల్గొన్నారు.