ప్రజాశక్తి - దేవనకొండ
రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మూడేళ్ల క్రితం కొత్తపేట రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారని, నిర్మాణం మరిచారని జనసేన ఆలూరు ఇన్‌ఛార్జీ తెర్నేకల్ వెంకప్ప విమర్శించారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... గ్రామ రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలో ప్రధాన రహదారి, వీధుల్లో సిసి రోడ్లు, ఇంతవరకు వేయలేదని తెలిపారు. గ్రామంలో వికలాంగుడైన యువకుడు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను సమస్యలపై ప్రశ్నిస్తే వాలంటీరు ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని చెప్పారు. కక్ష సాధింపులు మంచివి కాదని, వీలైతే సహాయం చేయాలని, ఒకరికి నష్టం కలిగించే పనులు చేయకూడదని తెలిపారు. జనసేన మండల నాయకులు మక్బుల్, నందు, వీరేష్, బడేసాబ్, లక్ష్మన్న, కృపాకర్, శివ, అహ్మీన్, రంగస్వామి పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న వెంకప్ప










