Jun 18,2023 00:44

హాజరైన ఎమ్మెల్యే, అదికారులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: ప్రధాన పట్టణ రోడ్డు విస్తరణ పనులపై మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రోడ్డు విస్తరణ పై అధికారులతో ఎమ్మెల్యే నేతృత్వంలో ఆర్డిఓ జయరామ్‌ నేతృత్వంలో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసేందుకు సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్‌ విద్యుత్‌, టౌన్‌ ప్లానింగ్‌ మున్సిపల్‌, దేవాదాయ శాఖ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిషనర్‌ కనకారావు విస్తరణ పనులకు పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేష్‌ మాట్లాడుతూ, అబీద్‌ సెంటర్‌ నుండి పెద్ద బొడ్డేపల్లి వరకు రోడ్డు పనులు చేపట్టేందుకు తీర్మానం చేశారని, విస్తరణ పనులపై అన్ని నివేదికలు సిద్ధం చేశామని తెలిపారు. వ్యాపారస్తులకు, వర్తకులకు నష్టం జరుగుతున్నప్పటికీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నర్సీపట్నం డివిజన్‌ కేంద్రం కావడంతో అన్ని మండలాల నుండి అనేక పనులపై ప్రజలు రావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, వర్తకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణ పాల్గొన్నారు.