ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : రాయచోటి- రాజంపేట రోడ్డు విస్తరణ పనుల్లో వైసిపికి అందుతున్న అవినీతి వాటా ఎంత అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రశ్నించారు. శనివారం రాయచోటి పట్టణంలో రాయచోటి-రాజంపేట రోడ్డు విస్తరణలో అక్రమంగా ఇళ్లు కూలుస్తున్న ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల పొట్ట కొట్టడం అభివద్ధా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాలకు, అభివద్ధి పనుల కోసం ప్రభుత్వ, ప్రయివేటు భూములు తీసుకువచ్చని, కోల్పోయిన వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, ముందుగా గ్రామ సభలు నిర్వహించాలనే ఇంగితజ్ఞానం లేకుండా, ప్రాణాలను భయబ్రాంతులకు గురి చేసి రోడ్డు వేస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. రోడ్డు వేయడానికి అడ్డమున్న ఇళ్లను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారంటే అధికార పార్టీ తొత్తులుగా ఉన్నట్లుగా అర్థమవుతోందని చెప్పారు. రాజ్యాంగ చట్టాలను అమలు చేయలేని అధికారులు ఎవరైనా వైసీపి కార్యకర్తలుగా చెప్పుకోవచ్చని హితవు పలికారు. రోడ్డు విస్తరణలో అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య కుదిరిన అక్రమ అవినీతి ఒప్పందం కారణంగా ఇల్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇవ్వకుండా, వాటాల కోసం భయబ్రాంతులకు గురి చేసి, హక్కులను కాలరాస్తున్నారని ఇది సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని, నష్టపరిహారం చెల్లించే వరకు పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఫయాజ్ పాల్గొన్నారు.










