Jun 30,2023 23:02

టిడిఆర్‌ బాండ్లు అందజేస్తున్న మేయర్‌, ఎమ్మెల్యే తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతుందని, విస్తరణకు సహకరిస్తున్న స్థానికులకు నస్టపరిహారం, టిడిఆర్‌ బాండ్ల పంపిణీ కూడా వెంటనే చేయడం జరుగుతుందని మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు తెలిపారు. శుక్రవారం ఏ.టి అగ్రహారం రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌తో కలిసి టి.డి.ఆర్‌ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుగుంట నుండి ఏ.టి అగ్రహారం జీరో లైన్‌ వరకు 1.19 కిలోమీటర్లు 80 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ జరుగుతోందని, విస్తరణలో ప్రభావితం అవుతున్న 210 నిర్మాణాలకు రూ.7 కోట్లు నష్టపరిహారం అంచనా వేయగా ఇప్పటికే 4.60 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. టిడిఆర్‌ బాండ్ల కోసం 72 ఎండార్స్మెంట్‌ ఇవ్వగా రిజిస్టర్‌ డాకుమెంట్స్‌ ప్రతులు ఇచ్చిన 21 మందికి టి.డి.ఆర్‌ బాండ్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికీ త్వరలో అందిస్తామన్నారు. విస్తరణలో భాగంగా ఇరువైపులా సిసి డ్రెయిన్లు, కల్వర్టులు, పీకలవాగులోకి కనెక్షన్‌ డ్రెయిన్లు కూడా నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఎ.వెంకటరెడ్డి, ఎ.పద్మావతి, ఎ.సంతోష్‌, షేక్‌ రోషన్‌, సిటి ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, ఏసిపి అశోక్‌ కుమార్‌, డిఇ రమేష్‌బాబుపాల్గొన్నారు.
అవుట్‌ఫాల్‌ డ్రెయిన్ల నిర్వహణ పక్కాగా ఉండాలి..
వర్షా కాలంలో నగరంలో అవుట్‌ఫాల్‌ డ్రైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలని మేయర్‌ అన్నారు. 45వ డివిజన్‌లో పర్యటించి, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొరిటపాడు వాకింగ్‌ ట్రాక్‌, గౌతమి నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి సమస్య, పారిశుధ్య సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. గౌతమీ నగర్‌ 5వ లైన్‌లో అవుట్‌ఫాల్‌ డ్రైన్‌ సమస్య ఉందని, మురుగునీటి పారుదల లేక గృహాల వద్దనే మురుగునీరు ఉండటం వల్ల స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. మేయర్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, డ్రైన్‌ నిర్మించే సమయంలో స్థానిక ప్రజలకు సమస్య లేకుండా చూడాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ వై.మారుతి లింగారెడ్డి, జిఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.