ప్రజాశక్తి - చింతలపూడి
'108 అంబులెన్సు వెళ్లడానికి అవకాశం లేదు.. పిల్లలు పాఠశాలకు వెళ్లే మార్గం లేదు.. రోగులను మంచం మీద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు.. ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూపండి. రోడ్డు పనులు ప్రారంభించే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదు' అంటూ చింతలపూడి నగరపంచాయతీ వైఎస్‌ఆర్ కాలనీవాసులు రోడ్డు దుస్థితిపై సోమవారం ధర్నా నిర్వహించారు. కాలనీ వద్ద నుంచి పాతబస్టాండ్ మీదుగా నగరపంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. అక్కడ నుండి ఎంపిడిఒ కార్యాలయం వద్దకు చేరుకుని స్పందన కార్యక్రమం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాలనీకి రోడ్డు వేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే అస్సలు ఆ కాలనీ ఎక్కడుందని అడిగిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. తమ కాలనీకి కేవలం ఓట్ల కోసమే వస్తారని, ఆ తర్వాత ఊరు పేరు కూడా తెలియడం లేదని చెప్పడం అన్యాయమన్నారు. 16 సంవత్సరాలుగా రోడ్లు లేక నానాఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అనంతరం స్పందన కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ రాంబాబుకు వినతిని ఇచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన కాలనీవాసులతో దురుసుగా మాట్లాడటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వినతిపత్రం ఇస్తే ఇవ్వండి లేకపొతే వెళ్లిపోండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం తహశీల్దార్ కృష్ణజ్యోతి కాలనీవాసులతో మాట్లాడారు. రోడ్డు అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేస్తామని, వారంరోజుల్లో కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.










