Nov 20,2023 00:52

నందివెలుగు-కొలకలూరు రోడ్డుపై ధర్నాలో టిడిపి జనసేన శ్రేణులు

ప్రజాశక్తి - తెనాలి : వైసిపి పాలనలో రోడ్లు అధ్వానంగా మారాయని, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై చేపట్టిన ఆందోళనలు కొనసాగించారు. ఆదివారం తెనాలి వద్ద నందివెలుగు-గుంటూరు మార్గంలో కొలకలూరు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.280 కోట్లు మంజూరు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచలేదన్నారు. రోడ్లు అధ్వాన్నంగా, ప్రయాణకులకు తీవ్ర ఇబ్బంది కరంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని చెప్పారు. రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అవసరమైన చోట కనీసం మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ తెనాలి బండ్‌ పేరుతో విగ్రహాలకు ఖర్చు పెట్టే నిధులు రోడ్లకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. దాదాపు గంటకు పైగా జరిగిన నిరసనలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాయకులు టి.హరి ప్రసాద్‌, ఆర్‌.చిన్ని, ఇ.వెంకటపూర్ణచంద్‌, బి.అరుణ, డి.అనిత, జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్‌, జాకీర్‌ హుస్సేన్‌, డి.మధుబాబు పాల్గొన్నారు. మండల కేంద్రమైన పెదకాకానిలోనూ నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల - నరమాలపాడు రహదారిపై నిరసన తెలిపారు. నాయకులు బి.రామాంజనేయులు, పి.అంజయ్య, పి.హరి, యు.లక్ష్మీనారాయణ, జి.సురేష్‌ యాదవ్‌, సిహెచ్‌.రాము, కె.కృష్ణబాబు, కె.నాయుడు పాల్గొన్నారు.