Jan 06,2023 00:01

మాట్లాడుతున్న లోకనాథం

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:రాష్ట్రంలో రోడ్డు షోలు, ర్యాలీలపై నిషేధం విధించడం తగదని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జిఓ 1ను రద్దు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అరకులోయ మెయిన్‌ రోడ్డు వద్ద సీపీఎం అల్లూరి జిల్లా కమిటి ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధం మాట్లాడుతూ, అర్థాంరంగా జగన్‌ మోహన్‌ రెడ్డి జీఓ 1 తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర్రాన్ని చీకటి రోజులు తెస్తున్నారని, ఇది దుర్మార్గమన్నారు. ప్రతీ ప్రతిపక్షంలో జగన్మోహన్‌ రెడ్డి నాయకుడుగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో రోడ్డులపై బహిరంగ సభలు, పాదయాత్రలు చేశారని, అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. జీఓ తీసుకొచ్చి ప్రతీ పక్షాలు గొంతునోక్కే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం నాయకులను, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్లు, రోడ్డుపై అరెస్టులు చేసి, నిర్బందించే చేసే కార్యక్రమం చేస్తున్నారని పేర్కొన్నారు.
సీపీఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస మాట్లాడుతూ, వైసీపీ చీకటి జిఓ తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను అణిచివేయడనికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి ఇలాంటి దుర్మార్గమైన జిఓలతో ఆంక్షలు పెడుతున్నారన్నారు. ఏజెన్సీలో ఇప్పటికీ జీవో 3 రద్దు చేసి గిరిజన యువతకు మోసం చేశారని విమర్శించారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్త్తూ ప్రైవేటు వ్యక్తులకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరుతో గిరిజన సంపదను అక్రమ మార్గంలో దోచుకోవడానికి ఇలాంటి చీకటి జిఓలు తెస్తున్నారని విమర్శించారు. ముందుగా జిఒ 1 కాపీలను నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు కిల్లో సురేంద్ర, అనంతగిరి జడ్పీటీసీ డి. గంగరాజు, నాయకులు వి.ఉమామహేశ్వరవు, బాలదేవ్‌, రామారావు, పోతురాజు, సుందర్‌రావు, సూరిబాబు, పృద్విరాజ్‌, సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు.