Aug 04,2023 22:13

బిటి రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : మండలంలోని పులుగుమ్మి నుండి సీతానగరం మండలం రేపటివలస శివారు గ్రామానికి దశాబ్దాలుగా సరైన రహదారి లేక నానా ఇబ్బందులు పడుతుండేవారు. ఇటీవల ఎమ్మెల్యే అలజంగి జోగారావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆ గ్రామం వెళ్లారు. గ్రామస్తులు వ్యధ ఆలకించిన ఆయన శాశ్వత పరిష్కారం కల్పించడం కోసం అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికారులు నిధులు కేటాయించి రూ.1.20 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. శుక్రవారం నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావును గ్రామస్తులు కలిసి ఎన్నో ఏళ్ల తమ కల నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి మామిడి బాబ్జీ, బలగ శ్రీరాములు నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, బొమ్మి రమేష్‌, బలిజిపేట ఎంపిపి గుడివాడ నాగమణి, వైస్‌ ఎంపిపి బి.రవికుమార్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ కె.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలి
ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రైతులకు అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. మండలంలోని బందలిప్పిలో నియోజకవర్గ స్థాయిలో ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రైతులకు సబ్సిడీపై 10 వేలు విలువైన విత్తనాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉపకరణాలు ప్రధానమంత్రి అజరు పథకంలో భాగంగా పంపిణీ చేశారు. ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి ఎం.సుధారాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 604 మంది దళిత రైతులకు విత్తనాలు, పిఎండిఎస్‌ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముఖరాజు మాట్లాడుతూ ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా ఒక్కొక్క రైతుకు రూ.7,630 విలువ కలిగిన వ్యవసాయ ఉపకరణాలు, ఫెరామిన్‌ ట్రాప్స్‌, లూర్స్‌, ఎల్లో స్టికీ ప్లేట్స్‌, టార్పాలిన్స్‌, డ్రమ్ములు మొదలగునవి కూడా త్వరలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.