Oct 24,2023 20:15

ఘటనా స్థలంలో మృతిచెందిన రవికుమార్‌, గాయపడిన గౌరమ్మ

ప్రజాశక్తి-గరుగుబిల్లి :  మండలంలో నాగూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గొట్టివలసకు చెందిన బోను రవికుమార్‌ (38), కొత్తూరుకు చెందిన కొప్పర గౌరీశంకరరావు, అడ్డాపుశీలకు చెందిన గడదేసి గౌరమ్మ (45) కలిసి వివాహ కార్యక్రమానికి వంట చేసేందుకు బైక్‌పై నాగూరు వెళ్తున్నారు. నాగూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరిని పక్కనుంచి ఢకొీంది. దీంతో ముగ్గురు కిందపడిపోయారు. వీరిలో మధ్యన ఉన్న రవికుమార్‌ తలమీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గౌరమ్మ, గౌరీశంకరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గౌరమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మృతిచెందింది. రవికుమార్‌ భార్య రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.