ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, ఆమదాలవలస: శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేట వద్ద ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆమదాలవలస పట్టణానికి చెందిన మండా జగన్ (27), పూజారిపేటకు చెందిన నాయుడు సత్యనారాయణ (42) మృతి చెందారు. మెట్టక్కివలసకు చెందిన మండల ఈశ్వరరావు గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తమ స్నేహితునికి అనారోగ్యం కావడంతో శ్రీకాకుళంలోని ఆస్పత్రిలో చేర్పించేందుకు 108 వాహనంలో ఎక్కించారు. ఆమదాలవలస నుంచి ఆ వాహనం వెనుక జగన్, సత్యనారాయణ, ఈశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆదివారంపేట వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్న శ్రీకాకుళం రూరల్ మండలం లంకాంకు చెందిన ఇద్దరు యువకులు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢకొీట్టారు. ఈ ఘటనలో జగన్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సత్యనారాయణను 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మృతి చెందాడు. గాయాపాలైన ఈశ్వరరావును మెరుగైన చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఢకొీట్టిన యువకులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. మృతుడు జగన్ అయ్యప్పస్వామి ఆలయంలో అర్చకుడుగా చేస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. సత్యనారాయణ వంట పనులు, టైలరింగ్ చేస్తున్నాడు. అతనికి భార్యతో విభేదాలు ఉండడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. రిమ్స్ అవుట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు.










