Apr 01,2023 21:23

బోల్తా పడిన బొలెరో వాహనం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- ఆరుగురికి గాయాలు
- శ్రీశైలం ఘాట్‌లో అదుపు తప్పి స్కూటీని ఢకొీట్టిన బొలెరో
ప్రజాశక్తి - శ్రీశైలం

       శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో శనివారం బొలెరో, స్కూటీ వాహనాలు ఎదురెదురుగా ఢకొీన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మాచర్ల నుండి శ్రీశైలం వస్తున్న బొలెరో వాహనంలో ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం శ్రీశైలం శిఖరం దాటిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢకొీట్టాడు. డ్రైవర్‌ వెంకటేష్‌(35)కు ఇనుప రాడ్డు గుచ్చుకోవడంతో వాహనంలోనే మృతి చెందాడు. అనంతరం బొలెరో వాహనం ఎదురుగా శ్రీశైలం నుంచి దోర్నాలకు వెళ్తున్న స్కూటీపై వస్తున్న శివ నాగ ప్రసాద్‌(45)ను ఢకొీట్టి బోల్తా పడింది. దీంతో శివ నాగప్రసాద్‌ వాహనంపై నుంచి ఎగిరి చెట్ల పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శివ నాగ ప్రసాద్‌ శ్రీశైల దేవస్థానంలోని స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే బొలెరో వాహనంలో మిగిలిన 6 మందికి గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.