ప్రజాశక్తి -కంచరపాలెం: జ్ఞానాపురం బిఆర్‌టిఎస్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... మురళీనగర్ బర్మాకాలనీలో నివాసముంటున్న దినేష్ కుమార్ (27) సిపోర్టు వద్ద ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి డ్యూటీ ముగించుకొని సుజుకి యాక్సెస్ వాహనంపై సిపోర్ట్ నుంచి కాన్వెంట్ మీదుగా కంచరపాలెం వైపు ఇంటికి బయలుదేరాడు. ఈ తరుణంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన రామిరెడ్డి (27), పి.సాయిసాగర్ కలిసి సింహాచలం నుంచి కంచరపాలెం, కాన్వెంట్ జంక్షన్ మీదుగా ఆర్‌కె.బీచ్‌కు డ్యూక్ బైక్‌పై వేగంగా వెళుతున్నారు. జ్ఞానాపురం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీ ఎదురుగా బిఆర్‌టిఎస్ రోడ్డు వద్ద కంచరపాలెం వైపు వెళ్తున్న దినేష్‌కుమార్ వాహనాన్ని, డ్యూక్ బైక్‌తో రామిరెడ్డి ఢ కొట్టాడు. రెండు వాహనాలూ కిందపడిపోయాయి. ఈ ఘటనలో దినేష్‌కుమార్, రామిరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామిరెడ్డి వెనుక కూర్చున్న సాయిసాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పశ్చిమ ఎసిపి అన్నెపు నరసింహమూర్తి, కంచరపాలెం సిఐ విజరుకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దినేష్‌కుమార్, రామిరెడ్డి మృతదేహాలను కెజిహెచ్ మార్చురీకి తరలించారు. సాయిసాగర్‌ను చికిత్స నిమిత్తం కెజిహెచ్‌లో చేర్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. హెల్మెట్లు ధరించి ఉంటే ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సిఐ విజరుకుమార్ నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










