ప్రజాశక్తి-మార్టూరు రూరల్: లారీని పాల ట్యాంకర్ ఢకొీన్న ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన మార్టూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జడ్పీ హైస్కూల్ ఎదురుగా శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. యద్దనపూడి 108 సిబ్బంది ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట నుంచి అద్దంకి మండలం బొమ్మనంపాడు పాల కేంద్రానికి వెళుతున్న పాల ట్యాంకర్ డ్రైవర్ నాయుడు సుధీర్‌బాబు మార్టూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ముందు వెళుతున్న లారీ టైరు పంచరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో పాల ట్యాంకర్‌ను డ్రైవర్ అదుపుచేయలేక లారీని బలంగా ఢ కొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ సుధీర్ బాబు తీవ్రంగా గాయపడి ట్యాంకర్ కేబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఒక్కసారిగా వచ్చిన పెద్ద శబ్దానికి బ్రిడ్జి కింద ఉన్న స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి 108కి సమాచారమిచ్చారు. లారీలో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేస్తున్న సుధీర్‌ను అతి కష్టంమీద బయటకు తీశారు. 108 వాహనంలో ముందుగా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాలు విరిగి తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్టూరు పోలీసులు తెలిపారు.










