Nov 08,2023 21:20

కిరణ్‌ (ఫైల్‌)

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని మోదవలస వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బౌన్సర్‌ కిరణ్‌(20) మృతి చెందాడు. విశాఖప్నం పెదగంట్యాడకు చెందిన కిరణ్‌ ప్రయివేటు ప్రోగ్రామ్‌ నిర్వహకుని వద్ద బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి విజయనగరంలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రాత్రి 12 తరువాత ద్విచక్ర వాహనంపై తన స్నేహితునితో కలిసి విశాఖపట్నం బయలు దేరాడు. మోదవలస వద్దకు వచ్చేసరికి ఎదురుగా పశువులు లోడుతో వస్తున్న బోలేరు వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికలు తగరపువలస వద్ద ఉన్న ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న కిరణ్‌ మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న అతని స్నేహితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నష్ట పరిహారం ఇవ్వాలని ఆందోళన
ఆస్పత్రిలో మృతి చెందిన కిరణ్‌ మృతదేహాన్ని అక్కడి నుంచి జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ బుధవారం ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉన్నా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో నిలిపివేశారు. తమకు నష్ట పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం డెంకాడ పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. మృతిని కుటుంబాన్ని బోలేరు వాహనం యజమాని ఆదుకోవాలని, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు బొలేరు వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.