Jul 29,2023 16:50

ప్రజాశక్తి - భీమడోలు
       గ్రామ పరిధిలో కీలకమైన మూడు రోడ్ల జంక్షన్‌ అది.. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారు, వైద్యశాలలకు వెళ్లేవారు, గ్రామానికి రెండు వైపులా గల జాతీయ రహదారులపైకి చేరుకునేవారు, ఈ జంక్షన్‌ మీదగానే ప్రయాణం చేయాలి. ఈ జంక్షన్‌లో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు రెండు వైపులా భవనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దారి మీదుగా జంక్షన్‌కు వచ్చేవారు ఎదురుగా వచ్చే వాహనాల జాడ గుర్తించలేక తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ ఉద్యోగి ఫణి కుమార్‌ ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిపుణుల సలహాలను అడిగారు. వారి సూచనల మేరకు రోడ్డు జంక్షన్‌లోని డివైడర్‌ వద్ద మూడు మార్గాల ద్వారా వచ్చే వాహనాలు ముందస్తుగా ఒకదానిని మరొకటి గుర్తించేందుకు, కుంభాకార కటకం రూపంలో గల వాహనాల ప్రతిబింబాలను తెలియజేసే పరికరాలను ఏర్పాటు చేసి, వాటిని స్తంభానికి అమర్చితే ప్రమాదాలు తగ్గుతాయని సూచించారు. దీనిపై స్పందించిన ఫణికుమార్‌ వేలాది రూపాయల వ్యయంతో 2017లో ఈ తరహా ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ప్రదేశం వద్ద ప్రమాదాలు తగ్గాయి. కానీ కొంత కాలానికి ఆ కటకం ధ్వంసమైంది. గుర్తు తెలియని కొందరు ఆకతాయిలు సదరు అద్దాన్ని పాడు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో తిరిగి ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు యధావిదిగా జరగడం ప్రారంభమైంది. ఇదే సమస్యపై మరొక మారు స్పందించిన ఫణికుమార్‌ తన కుమారుడు అభినవ్‌ జన్మదినం పురస్కరించుకొని శనివారం అదే ప్రాంతంలో కుంభాకార కటకం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఫణి కుమార్‌ సేవలను అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో పలువురికి ఉపయోగపడే సదర అద్దం సేవలను మరింత కాలం కొనసాగించేందుకు గతంలో మాదిరి దానిపై దాడులు జరగకుండా చూడాలని గ్రామపంచాయతీ, పోలీసు వారిని కోరుతున్నారు.