ప్రజాశక్తి-అనకాపల్లి
రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన అవసరమని కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి అన్నారు. రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని రింగ్ రోడ్డు నుంచి నెహ్రూ చౌకు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ గౌతమి శాలితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది కంటే రోడ్డు ప్రమాదాలను 40 శాతం తగ్గించే క్రమంలో పోలీస్, రవాణా, ఇంజనీరింగ్, వైద్య శాఖలు సమన్వయంతో పని చేసినట్లు తెలిపారు. ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ ప్రజలకు రహదారి నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఎం.వీర్రాజు మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు విజయభాస్కర్, సత్యనారాయణ, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ శ్రీకాంత్, డిఆర్‌డిఎ పిడి లక్ష్మీపతి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్, రాజన్న, మురళీకృష్ణ, శివరాం, గోపాల్, వెంకటరావు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు శ్రీను, మోహన్ రావు, పోలీస్, రవాణా, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కశింకోట : రహదారి భద్రతపై మండలంలోని నరసింగబిల్లి జాతీయ రహదారిపై డ్వాక్రా మహిళలు, స్కూల్ పిల్లలు శుక్రవారం ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య ఎపిఓ ఎం.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి మేరీ జోన్స్, హెచ్‌ఎం శాంతి కుమారి, వెలుగు సీసీ శ్రీను, విఓఏలు జోగిరత్నం, ఆదిలక్ష్మి, పి లక్ష్మీ నాగేష్, నాగమణి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.










