Nov 13,2023 23:48

రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ప్రమాదానికి గురైన లారీ

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వాటిల్లిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగు మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండల కేంద్రానికి చెందిన అభి (21), కిషోర్‌ (19), ప్రేమ్‌కుమార్‌ ముగ్గురు స్నేహితులు. అభి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా కిషోర్‌ గుంటూరు మిర్చియార్డులో ముఠా కార్మికునిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తెనాలిలో బంధువుల ఇంట ఉన్న ప్రేమ్‌కుమార్‌ను దీపావళి సందర్భంగా కలిసేందుకు అభి, కిషోర్‌ ఆదివారం రాత్రి తెనాలి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురూ కలిసి తెనాలి నుంచి భట్టిప్రోలు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పట్టణంలోని చెంచుపేట వైపు నుంచి ఫ్లైఓవర్‌ ఎక్కిన తర్వాత బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢఒకట్టడంతో అభి, కిషోర్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన ప్రేమ్‌కుమార్‌ను స్తానికులు తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం, కూచినపూడికి చెందిన దున్న రాజేశ్వరరావు (28) తెనాలి మండలంలోని కంచర్లపాలెంలో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై నందివెలుగుకు వ్యక్తిగత నిమిత్తం వెళ్లాడు. పని పూర్తయ్యాక తిరిగివస్తుండగా తెనాలి నుంచి నందివెలుగు వైపు ముగ్గురితో వస్తున్న మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢకొీంది. రాజేశ్వరరావు అక్కడికక్కడే మతి చెందగా మరో ద్విచక్ర వాహనంపైనున్న నందివెలుగు నాగమల్లేశ్వరరావు, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించగా రూరల్‌ ఎస్‌ఐ సిహెచ్‌ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.
తెనాలి మండలంలోని చావావారిపాలేనికి చెందిన నీల మోషె (55) ప్రమాదవశత్తు కాల్వలో పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం పొలానికి మందు చల్లే ట్యాంక్‌ రైతుకు ఇచ్చేందుకంటూ సైకిల్‌పై వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం చావావారిపాలెం శివాలయం ఎదురుగా ఉన్న కొత్త కాల్వలో పడి చనిపోయి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. పని పూర్తయ్యాక ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఉంటాడని, తలకు రాయి తగలడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని పెద్ద నెమలిపురిలోని పోలేరమ్మ గుడి వద్ద సోమవారం వాటిల్లిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిమెంట్‌లో కలిపే పౌడరు లోడును నెల్లూరు నుండి తెలంగాణలోని మట్టపల్లి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీకి లారీలో తీసుకెళ్తుండగా వాహనం అద్దంకి - నార్కెట్‌పల్లి రహదారిలో పెదనెమలిపురి వద్దకు రాగానే టైరు పగిలింది. దీంతో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఝార్ఖండ్‌కు చెందిన డ్రైవర్‌ మహమ్మద్‌ సిద్ధిక్‌(27) అక్కడికక్కడే మతిచెందాడు. క్లినర్‌ అయిన అతని సోదరుడు గాయపడ్డంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సిద్ధిక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.