ప్రజాశక్తి-సంతమాగులూరు: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి, కేసుల పురోగతి ఎలా ఉంది, అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై జరుగుతున్న యాక్సిడెంట్ కేసులను ఎలా కంట్రోల్ చేయాలి అనే అంశాలపై పరిశీలన చేసినట్లు తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు ప్రమాదా లు తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, స్టేషన్ సిబ్బంది పనితీరు, ఎస్‌ఐ, సీఐల పనితీరును పరిశీలించినట్లు ఆయన తెలిపారు. తప్పులు చేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. సంతమాగులూరు పోలీస్ స్టేషన్ గతంలో మోడల్ స్టేషన్‌గా ఎంపికైనా కూడా ఇంతవరకు నిర్మాణాలు చేపట్టలేదని, ఇప్పటికైనా మోడల్ స్టేషన్‌ను నిర్మించాలని ఏల్చూరు గ్రామ ప్రజాప్రతినిధి ఓరుగంటి కోటిరెడ్డి ఎస్‌పి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అధికారులకు వాహనాలు కూడా సమకూర్చాలని పలువురు ఎస్‌పి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముందుగా పోలీస్ అధికారులతో పాటు, మహిళా పోలీసు లు, మండల ప్రజా ప్రతినిధులు పుష్ప గుచ్ఛాలతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిఎస్పి టి వెంకటేశ్వర్లు, సిఐ ప్రభాకర్, ఎస్‌ఐ ఎంవి శివకుమార్, ఎంపీపీ ఎనుబర్ల ఎలమంద, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సన్నెబోయిన గురు యాదవ్, వైసిపి మండల కన్వీనర్ చింతా రామారావు, నాయకులు అట్లా పెద్ద వెంకటరెడ్డి, దుద్దేల గాలెయ్య, వి ముసలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










