
ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్ : నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో అక్టోబర్ మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించి, నమోదైన, దర్యాప్తులో ఉన్న నేరాల కేసులను సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్, ఎన్‌డిపిఎస్, ఐటి యాక్ట్ కేసులు, మహిళలపై జరిగే అన్యాయాలు, ప్రాపర్టీ దొంగతనాలు వంటి కేసుల గురించిన వివరాలు రిజన్‌వైజ్‌గా విశ్లేషించి వాటి దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి తగు నిర్దేశాలు జారీచేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, రోడ్డు భద్రతా నియమాలపై వినూత్న రీతిలో అవగాహన కల్పించి వాహన తనిఖీలు చేపట్టాలని, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలని, ఎంవి నిబంధనలు అతిక్రమించిన వారిపై చలానాలు విధించాలని, బైకు, ఇండ్ల దొంగతనాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అక్రమ మద్యం అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై దృష్టి సారించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు జరిపాలన్నారు. అదృశ్యం కేసుల్లో దర్యాప్తు చేసి, తప్పిపోయిన వారిని పట్టుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్లు సమర్పించాలని ఆదేశించారు. ప్రాధాన్యత కేసుల గురించి అడిగి తెలుసుకొని వాటిలో శిక్షలు పడేలా చేసి బాధితులకు న్యాయం జరిగేలచేయాలని సూచించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో హత్య కేసులో ముద్దాయిలకు కఠిన శిక్ష పడేలా కృషి చేసిన పాచిపెంట కోర్టు కానిస్టేబుల్ రామ్మోహన్, కంప్యూటర్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ నేర సమీక్ష సమావేశంలో ఎఎస్‌పి డాక్టర్ దిలీప్ కిరణ్, దిశా డిఎస్పీ ఎస్.ఆర్.హర్షిత, డిఎస్‌పిలు జివి కృష్ణారావు, జి.మురళీధర్, సిఐలు సిహెచ్.లక్ష్మణరావు, ఎన్‌వి ప్రభాకరరావు, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.