Sep 08,2023 22:51

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు : రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన పటిష్ట భద్రతా చర్యలను రవాణా, పోలీసు, రహదారి శాఖల అధికారులు సమన్వయంతో తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గత ఆరు నెలలతో పోల్చితే ప్రస్తుతం రహదారి ప్రమాదాల శాతం తగ్గినట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. అయితే ఎంతో విలువైన ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో నష్టపోకుండా మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిని గుర్తించి చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఇప్పటికే గుర్తించిన బ్లాక్‌ స్పాట్ల వద్ద వేగనిరోధకాలతో పాటు ప్రమాద సూచికలు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసిన సర్వీస్‌ రోడ్లపైనే ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రయాణించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జాతీయ రహదారులపై ఎటువంటి పరిస్థితుల్లో కూడా ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రయాణించకుండా నిరోధించడానికి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులపై సమీప ప్రాంతాల ప్రజలు వ్యర్ధాలు వేయకుండా సంబంధిత ప్రాంతాల మున్సిపల్‌, పంచాయతీ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, రోడ్డు ప్రక్కల వేసిన చెత్తను తొలగించాలేగాని వాటికి నిప్పు అంటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రహదారులపై నీరు నిల్వ వుండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోల్డెన్‌ అవర్‌లో రహదారి ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులలో చేర్పించడంలో సహాయం అందించే వారికి గుడ్‌ సమర్టిన్‌ చట్టం ద్వారా నగదు పారితోషికం అందించి ప్రభుత్వం అభినందిస్తుందని, దీనిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రచురించిన ప్రచార పోస్టర్లను, బుక్‌లెట్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీం, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ ఆర్‌ శ్రీనివాసమూర్తి, ఎన్‌హెచ్‌ ఎఐ పీడీ పి.పార్వతీశం, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణబాబు, జిజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ఎంటిఎంసి కమిషనర్‌ శారదదేవి , ట్రాఫిక్‌ డీఎస్పీ బాలసుందరం, నగరపాలక సంస్థ ఎస్‌ఇ భాస్కరరావు పాల్గొన్నారు.