Oct 29,2022 00:01

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణ సహాయం చేయడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం పోస్టర్‌ను జిల్లా అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నూకాంబిక ఆలయం అప్రోచ్‌ రోడ్లో స్పీడ్‌ బ్రేకర్లు వేయాలని, డివైడర్లను తెరిచే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉద్యోగులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా అన్ని శాఖల అధికారులకు ఆదేశించాలని డిఆర్‌ఓకు సూచించారు. సమావేశంలో డిఆర్‌ఓ వెంకటరమణ, ప్రాంతీయ రవాణా అధికారి వీర్రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హేమంత్‌, ఆర్‌ అండ్‌ బి ఈఈ రమేష్‌, డిఆర్డిఏ పిడి లక్ష్మీపతి, జిఎం డిఐసి శ్రీధర్‌, పోలీస్‌ అధికారులు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.