రోడ్డు పనులు పూర్తి చేయండి : కమిషనర్
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: నగరంలోని టిటిడి పరిపాలనా భవనం పక్కన నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. స్థానిక భవానీనగర్ వద్ద గల టిటిడి పరిపాలనా భవనం పక్కన కాలువపై ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఇంజనీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. పనులు ఆలస్యం చేయడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్గంలో పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మనుషులను ఎక్కువ మందిని పెట్టి పనులు పూర్తి చేయాలన్నారు. నీరు ఒక పక్కగా వెళ్లేలా చేసి కాలువపై స్లాబ్ వేసే పనులు పూర్తి చేయాలన్నారు. ఈ మార్గంలో నివాసాలు ఉన్నవారు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేసి పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామి రెడ్డి, డీఈ విజయ కుమార్ రెడ్డి ఉన్నారు.










