ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మొదలయ్యాక చిప్పగిరి మండలంలో కొన్ని రహదారులకు మోక్షం లభించింది. మరికొన్ని రహదారులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. అవి కూడా పూర్తయితే బాగుంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
చిప్పగిరి మండలంలో రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చిప్పగిరి నుంచి బంటనహాల్ మీదుగా బంటనహాల్ రైల్వే స్టేషన్ వరకు రూ.4 కోట్లతో రోడ్డు పనులు పూర్తయ్యాయి. మంత్రి జయరామ్ స్వగ్రామమైన గుమ్మనూరుకు వెళ్లేందుకు రహదారి సరిగా లేక కంకర తేలి గుంతలుగా ఉండేదని, గత పాలనలో ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడే వారని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంత్రి స్వగ్రామం గుమ్మనూరుకు కూడా రోడ్డు వేయించుకోలేరా అని ప్రజలంతా చర్చించుకున్నారు. మంత్రి ప్రతిపక్షంలో ఏమీ చేయలేకపోయారు. మంత్రి తప్పనిసరిగా రోడ్డు వేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడి పెంచలపాడు నుంచి గుమ్మనూరు వరకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద రూ.5 కోట్ల నిధులతో రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. ఈ రోడ్డు పనులు పూర్తి కావడంతో మండలంలోని ప్రతి గ్రామానికీ చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిప్పగిరి నుంచి మద్దికెర వరకు చేపట్టబోయే రోడ్డు పనులకు రూ.10 కోట్ల నిధులతో టెండర్ కూడా పూర్తయిందని ఈ మధ్యనే అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఈ రోడ్డు పనులు చేపట్టేలా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. డివిజన్ ప్రాంతమైన పత్తికొండకు వెళ్లేందుకు అనువైన రహదారి ఇది ఒక్కటేనని, ఈ రోడ్డు పూర్తయితే చిప్పగిరి మండల ప్రజలే కాక హాలహర్వి మండల ప్రజలు కూడా సంతోషిస్తారని, ఈ ప్రాధాన్యత రోడ్డు పూర్తయ్యేలా మంత్రి జయరామ్, కలెక్టర్ సహకారం అందించాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో రూ.8 కోట్లతో చేపట్టి నిలిచిపోయిన నేమకల్లు నుంచి మొలగవల్లి రోడ్డు పనులు కూడా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.










