ప్రజాశక్తి - కొమరాడ : ప్రతి గ్రామానికి రహదారి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. శుక్రవారం గిరిజన ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న మాదిలింగి నుండి పూజారిగూడ రహదారికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంత ఆమె మాట్లాడుతూ ప్రజలకు కనీస అవసరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దశాబ్ద కాలంగా కనీస రహదారికి నోచుకోని గ్రామాలకు కూడా రహదారి సదుపాయం కల్పించేలా ప్రభుత్వ నిధులు మంజూరు చేసిందని, ఈ మేరకు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గిరిజన ప్రజలకు రోడ్డు, తాగునీరు, విద్య, వైద్య వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి రూపొందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వాలు గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సదుపాయాలు కల్పించే దుస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇప్పటికే గిరిజన ప్రజలు సాగు చేస్తున్న భూములకు పట్టాలిచ్చి వారికి రైతు భరోసా వంటి పథకాలు కూడా అందజేసిన ఘనత సిఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి శ్యామల, జెడ్‌పిటిసి ద్వారపురెడ్డి లక్ష్మి, మాదలింగి సర్పంచ్ తుమరాడ కళావతి, వైసిపి మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దన్ రావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శెట్టి మధుసూదనరావు, మండల సచివాలయ కన్వీనర్ యేగిరెడ్డి సింహాచలం, పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










