May 19,2023 22:51

ఆర్‌టిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టాన్స్‌పోర్టు సంఘాల నాయకులు

సిఐటియు, ట్రాన్స్‌ పోర్ట్‌ సంఘాల ఆందోళన
ప్రజాశక్తి - కాకినాడ రూరల్‌
రవాణా వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచిన రోడ్‌ ట్యాక్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయం వద్ద సిఐటియు, ట్రాన్స్‌ పోర్ట్‌ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా కాకినాడ టాటా మ్యాజిక్‌ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు వాలిశెట్టి శ్రీనివాస్‌, పి.రాజారమేష్‌లు మాట్లాడుతూ రవాణా వాహనాల ద్వారా వ్యాపారం ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉందన్నారు. కోవిడ్‌ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుని వాహనాలు నడుపుతున్నామని తెలిపారు. ఒకవైపు ఫైనాన్స్‌లు కడుతూ, పెరిగిన ఆయిల్‌ ధరలు భరిస్తూ, ఇప్పటికే ఉన్న ట్యాక్స్‌ చెల్లించడానికే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే పక్క రాష్ట్రాల్లో వందల రూపాయలుగా ఉన్న గ్రీన్‌ ట్యాక్స్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మరొక ప్రక్క రోడ్లు బాగాలేక వాహనాలు నిరంతరం రిపేర్‌ కి వచ్చి అదనపు ఖర్చులు భరిస్తున్నామన్నారు. ఈ సమయంలో మరలా 25 నుండి 30 శాతం రోడ్‌ ట్యాక్స్‌ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమంజసంగా లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన ట్యాక్స్‌ ఉప సంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు సిఐటియు ట్రాన్స్‌ పోర్ట్‌ కన్వీనర్‌ కె.సత్తిబాబు, టాటా మ్యాజిక్‌ పెద్దాపురం యూనియన్‌ అధ్యక్షుడు, పిఠాపురం యూనియన్‌ అధ్యక్షుడు అంజిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడుతూ ట్రాన్స్‌ పోర్ట్‌ డ్రైవర్స్‌ జీవనం సక్రమంగా సాగాలంటే ప్రభుత్వం తమ గురించి ఆలోచించాలన్నారు. ట్రాన్స్‌ పోర్ట్‌ రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోల్‌ డీజిల్‌లను జి.ఎస్‌.టి. పరిధిలోకి తీసుకురావాలన్నారు. అనంతరం ఆర్‌టిఒ సాయిప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తో పాటు కత్తిపూడి అధ్యక్షుడు రాజేష్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ డ్రైవర్స్‌ భాషా, రాము, మూర్తి, రమణ, బాబి, శేషు, సురేష్‌, వీరబాబు, బద్రి, రెడ్డి, కృష్ణ, శామ్యూల్‌ పాల్గొన్నారు.