ప్రజాశక్తి - చింతలపూడి
మండలంలోని మెత్తిమెల్లివారిగూడెం నుంచి ఊటసముద్రం వరకు రోడ్డు నిర్మించాలని మెత్తిమెల్లివారిగూడెం గ్రామస్తులు ఊటసముద్రం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెత్తిమెల్లివారిగూడెం నుంచి ఊటసముద్రం వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా ఉందని, ద్విచక్రవాహనదారులు కూడా ఆ రోడ్డులో ప్రయాణించలేకపోతున్నారని చెప్పారు. గర్భిణులు, విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు పొలాలకు వెళ్లాలన్నా, అనారోగ్యానికి గురైనవారిని ఆసుపత్రికి తరలించాలన్నా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రాణప్రాయస్థితిలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సమస్యపై ఎంపీ, ఎంఎల్‌ఎ, సర్పంచి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డును నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేశ్వరావు, వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, నాగ శ్రీనివాసరావు, రవి పాల్గొన్నారు.










