రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాశక్తి-కావలిరూరల్ : మండలంలోని తాళ్లపాలెం పంచాయతీ బట్లదిన్నె గ్రామానికి జాతీయ రహదారి నుండి గ్రామంలోకి నిర్మించే సిమెంటు రోడ్డు పనులను బుధవారం ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ బట్లదిన్నె గ్రామానికి రోడ్డు నిర్మాణంపై ఎవరూ పట్టించుకోలేదన్నారు. తాను గతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఉండే మహిళలు ఈ రోడ్డు విషయమై తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆ సమయంలోనే ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తేనే మీ గ్రామంలోనికి మళ్లీ వస్తానని హామీనిచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బట్లదిన్నె రోడ్డును త్వరగా పూర్తిచేసి మరొసారి గ్రామంలోనికి వస్తానని వివరించారు. అంతేకాకుండా డ్రెయినేజీకి మరో ఐదు లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, జెడ్‌పిటిసి జంపాని రాఘవులు, సర్పంచ్ సురేష్, ఎంపిటిసి, అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










