ప్రజాశక్తి - దేవనకొండ
చాలా ఏళ్లుగా అధ్వానస్థితిలో ఉన్న రహదారుల నిర్మాణాలకు అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం దేవనకొండ మండలం కొత్తపేట, కరిడికొండ, వరిముక్కల, వెలమకూరు గ్రామాల మట్టి రహదారుల నిర్మాణాలకు రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ భూమిపూజ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై తమ ఇబ్బందులు తొలగిపోతాయన్న ఆయా గ్రామాల ప్రజల ఆశ నిరాశగానే మిగిలింది. ఈ రహదారుల నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను ప్రారంభించలేదు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేదెన్నడో అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
మండలంలోని కొత్తపేట, కరిడికొండ, వరిముక్కల, వెలమకూరు గ్రామాల రహదారులు అధ్వానస్థితిలో ఉన్నాయి. మట్టి రహదారులపై గుంతలు ఏర్పడడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో అనేక అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నిత్యం వివిధ పనుల నిమిత్తం దేవనకొండకు రావాలన్నా, వ్యవసాయ పంట ఉత్పత్తులు కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లకు తరలించేందుకు అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. గర్భిణులు, బాలింతలు, అత్యవసర రోగులు వైద్యం కోసం వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి నిలిచిపోయిన ఆయా గ్రామాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అధ్వానంగా ఉన్న కొత్తపేట రహదారి










