
ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో నిలిచిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వైస్ ఎంపీపీ పాటుబోయి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడ్డిబంద, మర్రిఫుట్టు, అడలపుట్టు, వారుకుగుమ్మి, తేనెల మామిడితో పాటు కుమడ, దోడిపుట్, బిడిచంప గ్రామాల్లో రోడ్లకు నిధులు విడుదల అయినప్పటికీ పనులు చేపట్టలేదన్నారు. రోడ్డు సౌకర్యం లేక అత్యవసర వైద్య సేవలు అందక గిరిజనులు అవస్థలు పడుతున్నారన్నారు. అటవీ శాఖ అధికారులు రోడ్డు నిర్మాణాలకు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలను తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎంఎం శ్రీను మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుంటే ఫారెస్ట్ అధికారులు అనుమతి లేదని అడ్డుకున్నారన్నారు. రోడ్ల నిర్మాణలను అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కిల్లో నారాయణ, కిల్లో లోబ్బో, గోల్లోరి ప్రసాద్, వంతల రమూర్తి పాల్గొన్నారు.