Jul 17,2023 21:46

రోడ్డు మరమ్మతులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి - సీతానగరం : మండల పరిధిలోని సుమారు 10 గ్రామాల ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయం కల్పించేందుకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేసిన కృషి ఫలించింది. ఇటీవల గాదెలవలస, దయానిదిపురం, రంగంపేట, లక్ష్మీపురం గ్రామ సచివాలయాల పరిధిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామస్తులు చినభోగిలి కూడలి నుంచి ఏగోటివలస మీదుగా గాదెలవలస వరకు బిటి రహదారిని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఇచ్చిన హామీ మేరకు రహదారి మరమ్మతులను సోమవారం ఆయన ప్రారంభించారు. సుమారు 9.5 కిలోమీటర్ల బిటి రహదారి అభివృద్ధి పనులకు గాను పార్వతీపురం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధుల నుంచి ఎమ్మెల్యే రూ.1.96 కోట్లు మంజూరు చేయించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు మామిడి బాబ్జి, బలగ శ్రీరాములునాయుడు, వైసిపి మండల అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పోల ఈశ్వరనారాయణ, మాజీ జెడ్‌పిటిసిలు అంబటి కృష్ణంనాయుడు, తెంటు వెంకట అప్పలనాయుడు, సర్పంచులు వి.రాధాకృష్ణ, బి.భాస్కరరావు, బి.అన్నపూర్ణ, తిరుపతిరావు, కె.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
జగనన్న సురక్షతో మెరుగైన సేవలు
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. పెదభోగిలిలో వాలంటీర్లు, గృహసారథులు, ఉద్యోగులకు జగనన్న సురక్షపై ఆయన అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిని సందర్శించి, ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని, వాటిని జగనన్న సురక్ష యాప్‌లో రిజిష్టర్‌ చేయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జె.తెరేజమ్మ, ఎంపిటిసి సభ్యులు బి.సూర్యనారాయణ, ఎస్‌.గౌరికిరణ్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ ఎస్‌.కూర్మారావు, స్టేట్‌ డైరెక్టరు ఎస్‌.తిరుపతిరావు, సీనియర్‌ నాయకులు ఆర్‌వి పార్థసారథి, రమేష్‌, బి.వెంకటరమణ పాల్గొన్నారు.
పెదపెంకిలో గడపగడపకు
బలిజిపేట : మండలంలోని పెదపెంకిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే కనుక్కొని వాటి పరిష్కారానికి సైతం చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.