Mar 27,2023 23:57

ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులు, స్థానికులు

ప్రజాశక్తి -మునగపాక రూరల్‌
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ స్థానిక మెయిన్‌ రోడ్డుపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మండుటెండలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వాహనచోదకులు తమ మద్దతును ప్రకటించారు. వాహనాలు కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఎస్‌.బ్రహ్మాజీ, టిడిపి నాయకులు మొల్లేటి సత్యనారాయణ, గ్రామ రైతు సంఘం అధ్యక్షులు ఎఎన్‌వి మహేష్‌ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో గుంతలు పడి రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. ఈ ఏడాదిలో ఈ మార్గంలో ప్రమాదాలకు గురై నలుగురు మరణించారని, వందలాది మంది కాళ్లు, చేతులు విరిగి శాశ్వత వైకల్యం చెందారని తెలిపారు. వారం రోజుల లోగా ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే రోడ్డును పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు దాడి ముసలి నాయుడు, ఆడారి జగన్నాధరావు, దాడి శివ, ఆడారి లక్ష్మణరావు, ఆడారి పరశురాం, వెలగా మురళి,వేగి కుమార్‌ ఆటో కార్మికులు పాల్గొన్నారు.