ప్రజాశక్తి - ఆదోని
దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు, డ్రెయినేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాధాకృష్ణ తెలిపారు. ఆదోనిలోని కోర్టు సముదాయంలో రోడ్లు, డ్రెయినేజీ ఏర్పాటుకు మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి పనులకు మార్కింగ్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.29.5 లక్షలతో సబ్ కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయం, సబ్ జైలు, కోర్టు ప్రాంగణం గుండా రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ భవన్ ముందు ఉన్న డ్రెయినేజీ వరకు కాలువ ఏర్పాటు చేసి నీరు అటు వైపు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బంది ఉండేదని న్యాయవాదులు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు రెవెన్యూ మున్సిపల్ అధికారులను కోరామన్నారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్పందించి నిధుల మంజూరుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ ఇంజినీర్ వెంకట చలపతి రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్లు రాజశేఖర్ రెడ్డి, కృపాకర్, కాంట్రాక్టర్ ఎర్రి స్వామి ఉన్నారు.
రోడ్డు మార్కింగ్‌ను పరిశీలిస్తున్న రాధాకృష్ణ










