అనంతపురం : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలను నివారిద్దామని ఎస్పీ కెకెఎన్.అన్బురాజన్ తెలిపారు. పోలీసు, ఆర్టీఏ విభాగాలు సంయుక్తంగా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం నాడు అనంతపురం నగరంలో 2కె రన్ నిర్వహించారు. నగరంలో తెలుగు తల్లి కూడళి వద్ద జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, డిటిసి ఎం.వీరరాజులు పచ్చ జెండా ఊపి 2 కె రన్ ప్రారంభించారు. అంబేద్కర్ కూడళి, సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్డుల మీదుగా క్లాక్ టవర్ వరకు 2కె రన్ కొనసాగింది. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలన్నారు. కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయరాదన్నారు. అతి వేగంగా వాహనాలు నడపకూడదన్నారు. తప్పని సరిగా వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఇళ్లకు భద్రంగా చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఎ.హనుమంతు (ఏఆర్), జెఎన్టీయు రిజిస్ట్రార్ శేషాద్రి, అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి, ఏఆర్ డీఎస్పీ మునిరాజు, అనంతపురం ఆర్టీవో సురేష్ నాయుడు, పలువురు సిఐలు, ఆర్‌ఐలు, పోలీసు సిబ్బంది, జెఎన్టీయు విద్యార్థులు పాల్గొన్నారు.










