రోడ్డు అధ్వాన్నం
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
-పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ఆదోని
కనీస, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పాలకులు,అధికారులు నిర్లక్ష్యం చేయడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసినప్పుడే ప్రగతి కనపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. అభివృద్ధిని మరచి కేవలం సంక్షేమ పథకాల తోనే ప్రభుత్వం పరిమితం అవడం వల్ల ఆదోని పట్టణంలోని శివారు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని విపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. రోడ్డు అద్వాన్నం: ఆదోని పట్టణంలోని ఈ ఎస్‌ఐ ఆస్పత్రి రైల్వే గేటు నుండి రైల్వే గూడ్స్ షెడ్ వెళ్లే రోడ్డు అత్వానంగా మారింది. చిన్నపాటి వర్షం వచ్చిన నీరు నిలిచి ఆ ఆ రోడ్డంతా బురదమయమవుతోంది. ఆ సమయంలో అడుగు తీసి వేయలేని పరిస్థితి అని రోడ్డు గుండా వెళ్లేవారు చెబుతున్నారు. ఆ రోడ్డు వెంబడి సెయింట్ ఆంటోనీ హైస్కూల్‌కు వెళ్లే విద్యార్థులు క్రాంతి నగర్, రాజా సాహెబ్ నగర్ ప్రాంతాలకు వాసులు అటు వైపునే రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు గుంతల మాయం ఉండడంతో బైకులు ఇతర వాహనాల్లో వచ్చేవారు ఎదుగు, దిగుడు వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. బురద ,గుంతలు కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి లారీలకు తప్పని ఇబ్బందులు రైల్వే గూడ్స్ షెడ్ నుండి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన బియ్యము రైల్వే వ్యాగన్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. అక్కడినుండి లారీల ద్వారా గోదాములకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఫర్టిలైజర్ బస్తాలు దిగుమతి అవుతున్నాయి అక్కడి నుండి లారీల ద్వారా తరలించే సమయంలో గుంతల్లో ఇరుక్కొని లారీలు ఆగిపోతున్న సందర్భా లు ఉన్నాయి. రోడ్డు గుంతల మయంగా ఉండడంతో లారీలు లోడుతో వెళ్లే సమయంలో ఇరుక్కుని నిలిచిపోతున్న ఘటనలు ఉన్నాయి. రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని కనీసం గుంతలు పూడ్చాలని మున్సిపల్, రైల్వే అధికారులను కోరిన పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు. రైల్వే శాఖ పరిధిలో ఉందని తాము రోడ్డు నిర్మించలేమని మున్సిపల్ అధికారులు తప్పించుకుంటున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు బాగోగులు చూసుకో వాలని రైల్వే అధికారులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. రోడ్డు వెంబడి ముళ్ళపదలు విస్తరించుకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు పడ్డ గుంతలను గ్రావెల్‌తో పూడ్చాలని కోరుతున్నారు.
రోడ్డు దుమ్ముతో ఇబ్బందులు
మట్టి రోడ్డు కావడం వల్ల వాహనాల రాకపోకల వల్ల దుమ్ము ,దూళితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. లారీలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సమీపంలో ఉన్న ఇళ్లల్లోకి దుమ్ము దూళి రావడం వల్ల శ్వాస సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్నారు. అధికారులు సిమెంట్ రోడ్డు నిర్మించి దుమ్ముదూళి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని రాజా సాహెబ్ నగర్ వసూలు కోరుతున్నారు.










