Nov 22,2022 23:05

  • ధాన్యం లోడు ట్రాక్టర్లతో రాస్తారోకో

ప్రజాశక్తి - గుడ్లవల్లేరు
కృష్ణాజిల్లాలో ధాన్యం రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు సమయంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధాన్యం ట్రాక్టర్లతో సహా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. శాంపిల్స్‌ పరిశీలనలో ఆర్‌బికె సిబ్బంది ఒకరకంగా, మిల్లర్లు ఒకరకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు వద్ద జరిగింది. అంగలూరు గ్రామానికి చెందిన రైతులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాస్తారోకో చేయడంతో గుడివాడ - మచిలీపట్నం రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే తరుణంలో శాంపిల్స్‌ పరిశీలించి 25 శాతం తేమ ఉన్నట్లు నిర్ధారించి మిల్లర్లు వద్దకు పంపారని, అయితే మిల్లర్లు దానిని 27 శాతంగా నిరారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గుడ్లవలేరు ఎస్‌ఐ ఏసేబు తన సిబ్బందితో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా రాస్తారోకో చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం నేరమని వారిని హెచ్చరించి అక్కడ నుంచి పంపివేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ఈడే శ్రీను, ఈడే రవికుమార్‌ మాట్లాడుతూ తమ ధాన్యానికి ప్రభుత్వం కేటాయించిన ధరను అందించాలని, అలాగే ఆర్‌బికెలు శాంపిల్స్‌లో నిర్ధారించిన శాతాన్నే మిల్లర్లూ నిర్ధారించాలని కోరారు. దీనిపై గుడ్లవల్లేరు తాహశీల్దారు ఎమ్‌డి.రహమాన్‌ సుల్తానాను వివరణ కోరగా, శాంపిల్స్‌లో ఎలాంటి మార్పులు లేవన్నారు. ఆర్‌బికెలు నిర్వహించిన శాంపిల్‌నే నిర్ధారణ చేస్తామని అన్నారు. అయితే సేకరించే ధాన్యాన్ని పెడన మండలం నడుపూరు గ్రామానికి తరలించాలని రైతులకు సూచించగా, వారు అందుకు నిరాకరించి పామర్రు గ్రామానికి పంపుతామని అంటున్నారని తెలిపారు.