ప్రజాశక్తి - రొంపిచర్ల : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బత్తుల చిన్నమ్మాయి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో గురువారం తన భర్త బత్తుల రామకృష్ణ, అనుచరులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. యార్డు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి కొద్దికాలమే అయ్యిందని, ఈ కాలంలోనూ తన పదవికి తాను న్యాయం చేశానని చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంతూరైన సంతగుడిపాడులో ఇటీవల వినాయకుని విగ్రహం నిమజ్జనం అనంతరం జరిగిన గొడవల్లో ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కోమాలోకి వెళఙ్లన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఒక మహిళకు న్యాయం చేయలేని స్థితిలో తాను పదవిలో కొనసాగడం శ్రేయస్కరం కాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, మార్కెట్ యార్డు ఉన్నతాధికారులకు పంపుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు సిహెచ్.అంజిరెడ్డి, ఒ.శ్రీను, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










