Dec 15,2022 23:33

ఆర్లి అడవి లో సొరంగం తవ్విన ప్రదేశం

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలోని మరో రంగురాళ్లు క్వారీ బయట పడింది. ఈ రంగురాళ్లు కారిలో విలువైన అలెక్స్‌ వంటి జాతి రాళ్లు లభ్యమవుతున్నట్లు సమాచారం. గొలుగొండ మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు అది కాస్త అక్రమార్కుల చేతిలో నలిగి అడవి అంతా అంతరించి పోయింది. అక్రమార్కులు అక్రమంగా కలప నరికివేతతో అటవీ ప్రాంతం అంతరించిపోయింది. ఇదే కాకుండా ఈ అటవీ ప్రాంతంలో పప్పు శెట్టిపాలెం, కరక, ఇప్పుడు ఆర్లి అడవిలో రంగు రాళ్లు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలో రంగు రాళ్ల తవ్వకాలతో పాటు అటవీ కలప రవాణా జరుగుతుంది. ఇది కేవలం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కనుసల్లోనే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.
ఆర్లి అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తవ్వకాలు అటవీశాఖ కిందిస్థాయి సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అసలు ఫలానా ప్రదేశంలో రంగురాళ్లు దొరుకుతున్నాయనే సమాచారం ఇచ్చింది కూడా అటవీశాఖ కిందిస్థాయి సిబ్బందేనని ప్రచారం కూడా ఉంది. ఇంతే కాకుండా అటవీ శాఖ ఉన్నతాధికారికి గొలుగొండ అటవీ ప్రాంతం పై పూర్తి అవగాహన ఉంది. ఆయన గతంలో ఈ మండలంలోని పని చేశారు. గతంలో పప్పుశెట్టిపాలెం శివారులలో రంగురాళ్ల వ్యాపారులు పెద్ద పెద్ద సొరంగాలు తవ్వి రంగురాళ్లు వెలికి తీస్తున్న సమయంలో రెవిన్యూ, ఫారెస్ట్‌, పోలీస్‌ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి తవ్వకాలను అరికట్టడమే కాకుండా సొరంగాలను కాంక్రీట్‌తో మూయించారు. తర్వాత కొద్ది రోజులు తవ్వకాలు నిలిచి పోయాయి. ఇప్పుడు మళ్లీ ఆరిలోవ అటవీ ప్రాంతంలో రంగురాళ్లు దొరుకుతుండడంతో వ్యాపారస్తులు కూలీలను ప్రోత్సహించి తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ 15 రోజులలో సుమారు రూ.50 లక్షల రూపాయల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు, సిబ్బంది స్పందించక పోవడం గమనార్హం. రంగురాళ్ళు విరివిగా లభిస్తుండటంతో కూలీలు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతానికి ఇటీవల చేరుకున్నారు. ఒక దశలో అక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఇంత హడావుడి జరుగుతున్నా ఫారెస్ట్‌ అధికారులు అటువైపు చూడక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 15 రోజులుగా తవ్వకాల జరుగుతున్నప్పటికీ వాచర్లు, బీట్‌ ఆఫీసర్లు, రేంజర్‌ స్థాయి అధికారి కూడా నిలుపుదలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తవ్వకాల విషయం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో అప్పుడు గాని డీఎఫ్‌ఓ ఆ ప్రాంతంలో పర్యటించ లేదు. మీడియా ద్వారా ప్రచారం అయిన తర్వాత డిఎఫ్‌ఒ అక్కడికి చేరుకోవడం ఆశ్చర్యం. తవ్వకాలను నిలుపుదల చేసిన తర్వాత ఇప్పటివరకు ఐదుగురు పైనే కేసు నమోదు చేశారు. ఇంకా 25 మందిపై కేసు నమోదు చేయాలని అధికారులే తెలియజేశారు. మరి ఇప్పటివరకు వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పందించని అటవీశాఖ అధికారులు
ఇంత ముమ్మురంగా తవ్వకాలు జరిగినప్పటికీ రేంజర్‌, మిగతా అధికారులు, సిబ్బంది కనీసం స్పందించకపోతే రంగురాళ్ల తవ్వకాలు, కలప అక్రమ రవాణాను ఏ విధంగా అడ్డుకోగలరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ మండలంలో సిబ్బంది తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని పలువురు తెలిపారు.