
ప్రజాశక్తి -గొలుగొండ: రెండు నెలల క్రితం సాలికి మల్లవరం రంగురాళ్ల క్వారీలో జరిగిన అక్రమ తవ్వకాలపై స్టేట్ విజిలెన్స్ డి ఎఫ్‌ఓ రవిశంకర్ శర్మ మంగళవారం విచారణ నిర్వహించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుతో విచారణకు వచ్చినట్లు రవి శంకర్ శర్మ తెలిపారు. క్వారీలో తవ్వకాలు జరిగిన విధానం పై విచారిస్తున్నట్లు చెప్పారు. క్వారీ ప్రాంతాన్ని సందర్శించి మట్టి తవ్వకాలను పరిశీలించారు. సాలికి మల్లవరం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌తో పాటు మరి కొంతమందితో మాట్లాడారు. క్వారీలో అక్రమ తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులు, వినియోగించిన యంత్రాలు, ఎంత లోతు మేర తవ్వకాలు జరిపారన్న అంశాలపై పలు కోణాల్లో విచారణ చేపట్టారు. అదే రోజున స్ట్రైకింగ్ ఫోర్స్ గస్తీ సిబ్బంది విధులను ఎందుకు నిలిపారన్నదానిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి కె.వి రమణ, సిబ్బంది పాల్గొన్నారు.