Oct 04,2023 00:47

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : రంగు రాళ్లు, వజ్రాలు ఉన్నాయంటూ నరసరావుపేట మండలంలోని కేసానుపల్లికి జనం తరలివస్తున్నారు. గ్రామ పరిధిలోని నరసరావుపేట-చిలకలూరిపేట రోడ్డు పక్కన ఓ వెంచర్‌లో ఉన్న మట్టిలో వెతుకులాట ప్రారంభించారు. సమీప గ్రామాలతోపాటు గుంటూరు నుండి కూడా పలువురు భోజనాల క్యారేజీలు తెచ్చుకుని మరీ వచ్చి ఎండనూ లెక్కచేయకుండా వెదుకుతూనే ఉన్నారు. వెతుకులాడే వారిలో విద్యావంతులూ ఉండడం గమనార్హం. మరోవైపు వెతుకులాట ప్రదేశంలో తినుబండారాల విక్రయమూ జోరుగా సాగుతోంది. సత్తెనపల్లి మండలంలోనూ కొద్ది రోజుల కిందట ఇదే తరహాలో వెదుకులాడిన విషయం తెలిసిందే.