ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పార్వతీపురం పట్టణానికి వర్షాకాలంలో రంగు మారిన తాగునీరు సరఫరా జరుగుతోంది. దీంతో పట్టణ మహిళలు, ప్రజలు మున్సిపల్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా కొళాయిల ద్వారా రంగుమారిన తాగునీరు సరఫరా చేయడంతో గత్యంతరం లేక ఆ నీటినే పట్టుకునే దుస్థితి నెలకొంది. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాపై ప్రతిఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఈ సమస్య ప్రతి ఏడాది పునరావృతమవుతుందని, ఈ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఈ విషయంపై చొరవ చూపకపోవడమేమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీరు సేవించి ప్రజలు అనారోగ్యంబారిన పడి ఆసుపత్రుల పాలయ్యే అవకాశం ఉంది. రంగు మారిన తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు, పాలకవర్గ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి, పట్టణ ప్రజలకు శుద్ధ తాగునీటి జలాలను సరఫరా చేయాలని కోరుతున్నారు..










